డ్రైవర్‌లెస్ కార్లకు భారత్‌లో అనుమతిలేదు: నితిన్ గడ్కరీ

by Disha Web Desk 16 |
డ్రైవర్‌లెస్ కార్లకు భారత్‌లో అనుమతిలేదు: నితిన్ గడ్కరీ
X

న్యూఢిల్లీ: భారత రోడ్లపై డ్రైవర్‌లెస్ కార్ల ఆలోచనపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అటువంటి కార్లను దేశీయ రోడ్లపై అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. రహదారుల భద్రతకు సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన గడ్కరీ, డ్రైవర్‌లెస్ కార్ల వల్ల లక్షలాది మంది ఉపాధిని కోల్పోతారని చెప్పారు. భవిష్యత్తులోనూ వాటికి అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఇదే సమయంలో టెస్లా కార్లను విక్రయించేందుకు అనుమతి ఉంటుంది కానీ, చైనాలో తయారు చేసి, ఇక్కడ అమ్మడానికి అంగీకరించమని గడ్కరీ వెల్లడించారు. అలాగే, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధునాతన టెక్నాలజీ వినియోగానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. రహదారి భద్రతకు సంబంధించి అవగాహనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడానికి కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగుల నిబంధన, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పష్టమైన హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌ని సూచించే ఏర్పాట్లు, ఎలక్ట్రిక్ మోటార్స్ చట్టాన్ని మరింత కఠినం చేస్తూ ప్రమాదాలకు కారణమైన వారికి భారీ జరిమానా విధించే చర్యలు తీసుకుంటామని గడ్కరీ వివరించారు. కాగా, ఇప్పటికే దేశీయంగా రోడ్లపై ఉన్న కార్లలో ఆటోపైలట్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ కార్లు స్టీరింగ్‌తో పాటు బ్రేక్, ఆక్సలరేటర్‌ను డ్రైవర్‌తో సంబంధం లేకుండా నియంత్రిస్తుంది.

Next Story

Most Viewed