నవంబర్‌లో వాహన పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు!

by Dishanational4 |
నవంబర్‌లో వాహన పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు!
X

చెన్నై: ఈ ఏడాది నవంబర్ నెలలో దేశీయ వాహన పరిశ్రమ రికార్డు స్థాయిలో రిటైల్ అమ్మకాలను సాధించిందని పరిశ్రమ డీలర్ల సమాఖ్య ఫాడా శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. అన్ని విభాగాల్లో విక్రయాలు గణనీయంగా పెరిగాయని పేర్కొంది. గత నెలలో మొత్తం వాహనాల రిటైల్ అమ్మకాలు 23,80,465 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 18,93,647 యూనిట్లతో పోలిస్తే ఇది 26 శాతం అత్యధికం కావడం గమనార్హం. కోవిడ్‌కు ముందు సంవత్సరం 2019, నవంబర్‌లో 23.44 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020, మార్చిలో వాహనాలను బీఎస్4 నుంచి బీఎస్6కి మార్చిన నెల కాకుండా మొత్తంగా భారత వాహన పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు గత నెలలో నమోదవడం విశేషం.

దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ముగిసినప్పటికీ ఈ స్థాయిలో అమ్మకాలు జరిగాయని, ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ విక్రయాలకు కీలక మద్దతుగా నిలిచినట్టు ఫాడా ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా చెప్పారు. సమీక్షించిన నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు గతేడాది కంటే 21 శాతం వృద్ధితో 3,00,922 యూనిట్లుగా నమోదయ్యాయి. గ్రామీణ మార్కెట్లో డిమాండ్ పెరగడం, కొత్త మోడళ్లతో ఈ విభాగం అమ్మకాలు పుంజుకున్నాయి. ముఖ్యంగా ఎస్‌యూవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీ వేరియంట్ల కోసం వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపించారు. ఈ రెండు విభాగాల్లో అమ్మకాలు 24 శాతం పెరిగి 18.48 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. కమర్షియల్ వాహనాల విభాగంలో సైతం అమ్మకాలు 33 శాతం అధికంగా 79,369 యూనిట్లుగా, త్రీ-వీలర్ అమ్మకాలు 81 శాతం, ట్రాక్టర్ అమ్మకాలు 57 శాతం పెరిగాయని ఫాడా వెల్లడించింది.

Also Read....

Unknown Facts : క్యాప్సికమ్ గురించి ఆశ్చర్యపరిచే వింత నిజాలు !


Next Story

Most Viewed