భారత్‌లో ఈవీ ప్లాంట్ ఏర్పాటు యోచనలో VOLVO!

by Disha Web Desk 17 |
భారత్‌లో ఈవీ ప్లాంట్ ఏర్పాటు యోచనలో VOLVO!
X

న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా దేశీయంగా తన కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధిక డీజిల్, పెట్రోల్ వాహనాల ధరల కారణంగా ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనాకు వెలుపల తమ ఈవీ తయారీ ప్లాంట్ కోసం ప్రణాళిక కలిగి ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.

అయితే, ప్లాంటు ఏర్పాటు ఎక్కడ ఉండాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, భారత్‌లో ఏర్పాటు అవకాశాలు ఉన్నాయని కంపెనీ గ్లోబల్ సీఈఓ అన్నారు. ప్రధానంగా లాజిస్టిక్ ఖర్చులు, ఇతర ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ఆసియాలో అవకాశాలను అన్వేషిస్తున్నామని జిమ్ రోవాన్ వెల్లడించారు. గతేడాది కంపెనీ భారత మార్కెట్లో తన వ్యాపారాన్ని విస్తరించాలని ప్రకటించింది.

ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ వాహనాల విభాగం నుంచి మూడింట ఒక వంతు ఆదాయం వస్తుందని కంపెనీ అంచనా వెసింది. ఇప్పటికే ఈ విభాగం కింద రెండు డీలర్‌షిప్‌లతో దేశీయంగా ప్లాట్‌ఫామ్‌ను కంపెనీ ప్రారంభించింది. కంపెనీ అంచనాల ప్రకారం సాంప్రదాయ ఇంధన వాహనాలు, ఈవీల ధరలు 2025 నాటికి ఒకే స్థాయిలో ఉండనున్నాయి. దీనివల్ల ఎక్కువ మంది వినియోగదారుల వద్ద ఈవీలు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.


Next Story

Most Viewed