Vi 5G Launch : త్వరలో వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు ప్రారంభం!

by Disha Web Desk 17 |
Vi 5G Launch : త్వరలో వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు ప్రారంభం!
X

న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో ఉన్న టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా త్వరలో తన 5జీ నెట్‌వర్క్ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే ప్రత్యర్థి కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా 5జీ సేవలను వేగంగా విస్తరించే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు ప్రారంభించేందుకు ఓఈఎం(ఒరిజినల్ పరికరాల తయారీదారుల)తో కలిసి కొన్ని డివైజ్‌లలో పరీక్షలు పూర్తి చేసినట్టు తన వార్షిక నివేదికలో పేర్కొంది.

ఈ సందర్భంగా మాట్లాడిన వొడాఫోన్ ఐడియా చైర్మన్ రవీందర్ టక్కర్, 4జీ కవరేజీ పెంచడంతో పాటు 5జీ సేవలను తీసుకొస్తామన్నారు. అందుకవసరమైన పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నామని, ముఖ్యంగా కంపెనీకి చెందిన 17 ప్రధాన సర్కిళ్లలో నిధులు అందుబాటులోకి వచ్చిన వెంటనే 5జీ సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.

యూకే ఆధారిత వొడాఫోన్, భారత్‌కు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్ జాయింట్ వెంచర్ అయిన వొడాఫోన్ ఐడియా నిధులు సేకరించేందుకు పెట్టుబడిదారులతో చర్చిస్తోంది. కాగా, జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే 5జీ సేవలను అందిస్తున్నాయి. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా కంపెనీలు లక్ష్యాన్ని నిర్దేశించాయి.

వొడాఫోన్ మాత్రం నిధుల సేకరణ ఆలస్యం కారణంగా 5జీ ని లాంచ్ చేయలేదు. ప్రస్తుతం కంపెనీ రూ. 20 వేల కోట్ల వరకు సమీకరించాలని భావిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ మొత్తం అప్పులు రూ. 2.09 లక్షలు ఉండగా, కంపెనీ వద్ద నగదు నిల్వలు రూ. 230 కోట్లు ఉన్నాయి.


Next Story

Most Viewed