త్వరలో వొడాఫోన్ ఐడియా 5జీ.. భారీగా నిధుల కేటాయింపు

by S Gopi |
త్వరలో వొడాఫోన్ ఐడియా 5జీ.. భారీగా నిధుల కేటాయింపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా ఎట్టకేలకు 5జీ నెట్‌వర్క్ సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే పోటీ కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ కోట్లాది 5జీ సబ్‌స్క్రైబర్లతో దూసుకెళ్తుండగా, వొడాఫోన్ ఐడియా(వీఐ) మాత్రం నగదు కొరత కారణంగా ఇందులో వెనుకబడి ఉంది. తాజాగా 5జీ నెట్‌వర్క్ ప్రారంభం కోసం రూ. 5,720 కోట్లను కేటాయిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ నిధులతో 5జీ తీసుకురావడమే కాకుండా ప్రస్తుతం 2జీ బేస్‌లో ఉన్న సబ్‌స్క్రైబర్లను అప్‌గ్రేడ్ చేసి 4జీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయనుంది. రాబోయే 24-30 నెలల్లోగా ప్రస్తుతం కంపెనీ అందుకుంటున్న రాబడిలో 40 శాతం 5జీ నుంచి పొందాలని వీఐ లక్ష్యంగా ఉంది. అలాగే, 4జీ మెరుగైన కవరేజ్ కోసం 900ఎంహెచ్‌జెడ్, 2100ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌లను రీఫార్మింగ్ చేయనుంది. ప్రధాన 17 సర్కిళ్లలో 4జీ కవరేజీని విస్తరించడానికి తాజా పెట్టుబడులు పెట్టనున్నామని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అక్షయ ముండ్రా అన్నారు. కంపెనీ మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్‌లో దాదాపు 42 శాతం మంది ఇంకా 2జీలోనే ఉన్నారు. కొత్త పెట్టుబడుల ద్వారా కంపెనీ ఒక్కో వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు) పెరుగుతుందని ఆశిస్తున్నట్టు అక్షయ ముండ్రా చెప్పారు. తక్కువ విలువైన ప్లాన్‌ల నుంచి అపరిమిత డేటా ప్లాన్‌లకు మార్చడం ద్వారా సుమారు మూడు రెట్లు ఆర్పు మెరుగవుతుందని ఆయన పేర్కొన్నారు.Next Story

Most Viewed