5జీ కోసం ఎక్కువ ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా వినియోగదారులు!

by Disha Web Desk 17 |
5జీ కోసం ఎక్కువ ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా వినియోగదారులు!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం 5జీ స్మార్ట్‌ఫోన్‌లను కలిగిన 10 కోట్ల మంది వినియోగదారులు వచ్చే ఏడాది ప్రారంభం నాటికి 5జీ నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ కావాలనుకుంటున్నారని ఎరిక్సన్ నివేదిక తెలిపింది. అంతేకాకుండా వీరిలో 45 శాతం మంది 5జీ సేవలు పొందడానికి ఎక్కువ ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. దీనివల్ల భవిష్యత్తులో దేశీయ టెలికాం కంపెనీలు మెరుగైన ఆదాయాన్ని చూడగలవని బుధవారం విడుదలైన నివేదిక అంచనా వేసింది.

చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అయిన భారత్‌లో త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఎరిక్సన్ సర్వేకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సర్వేలో పాల్గొన్న వినియోగదారుల్లో చాలామంది 5జీ సేవలు మెరుగైన నాణ్యతతో ఉండాలని భావిస్తున్నారు.

సుమారు 36 శాతం మంది నాణ్యత ఆధారంగా టెలికాం నెట్‌వర్క్‌ను ఎంచుకుంటామని చెప్పగా, 60 శాతం మంది ఇప్పుడున్న యాప్‌ల కంటే మెరుగైన, కొత్త రకమైనవి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. పట్టణాల్లోని వినియోగదారులు 5జీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 5జీ స్మార్ట్‌ఫోన్లు ఉన్న వారిలో దాదాపు సగానికి పైగా వ్యక్తులు రాబోయే ఏడాదిలోగా ఎక్కువ ప్రీమియం కలిగిన ప్లాన్‌లకు మారడానికి ఆసక్తి చూపిస్తున్నారని నివేదిక వెల్లడించింది.


Next Story