యాపిల్‌పై దావా వేసిన అమెరికా ప్రభుత్వం

by Dishanational1 |
యాపిల్‌పై దావా వేసిన అమెరికా ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ కంపెనీపై అమెరికా ప్రభుత్వం దావా వేసింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీ లేకుండా చేయడం, వినియోగదారులపై విపరీతమైన ఖర్చుల ద్వారా చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్న కారణంగా యూఎస్ న్యాయ శాఖ యాపిల్‌పై దావా వేసింది. యాపిల్ అనుసరిస్తున్న విధానాల వల్ల పోటీ కంపెనీలు మార్కెట్లో నిలదొక్కుకోవడమే కష్టంగా మారింది. ఈ పరిణామాలతో కలిసొచ్చిన అవకాశాన్ని ధరలను కృత్రిమంగా పెంచి లాభపడుతోందని ప్రభుత్వం దావాలో పేర్కొంది. దీనివల్ల కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు లేకపోవడమే కాకుండా యాపిల్ అనుసరించే విధానాలతో కస్టమర్లు ఇతర చౌకైన స్మార్ట్‌ఫోన్‌లు, పరికరాలకు మారడం కష్టంగా మారిపోయింది. ఈ ఆరోపణలతో గుత్తాధిపత్యం కారణంగా సమస్యను ఎదుర్కొంటున్న గూగుల్, మెటా, అమెజాన్ సంస్థల జాబితాలో యాపిల్ కూడా చేరింది. యాపిల్ కంపెనీపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కంపెనీ షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. ఒక్కరోజే షేర్ ధర 4 శాతానికి పైగా నష్టపోయింది. దీంతో యాపిల్ మార్కెట్ క్యాప్ 113 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 9.41 లక్షల కోట్లు) క్షీణించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కంపెనీ షేర్ ధర 11 శాతం పతనమైంది. ఈ వ్యవహారంపై స్పందించిన యాపిల్ సంస్థ ఆరోపణలు అవాస్తవమని, ఈ చర్యల ద్వారా ప్రభుత్వం ఇబ్బంది సంప్రదాయాన్ని తీసుకొస్తోందని అభిప్రాయపడింది. ప్రజల కోసం తయారు చేసే టెక్నాలజీ అభివృద్ధిలో జోక్యం చేసుకుటోంది. దీన్ని న్యాయ పద్దతిలోనే ఎదుర్కొంటామని పేర్కొంది.


Next Story

Most Viewed