ఏప్రిల్‌లో రూ. 14 లక్షల కోట్లు దాటిన యూపీఐ లావాదేవీలు!

by Harish |
ఏప్రిల్‌లో రూ. 14 లక్షల కోట్లు దాటిన యూపీఐ లావాదేవీలు!
X

న్యూఢిల్లీ: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) లావాదేవీలు ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 890 కోట్లకు చేరాయని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. ఈ లావాదేవీల విలువ రూ. 14.07 లక్షల కోట్లని తెలిపింది. అంతకుముందు మార్చిలో విలువ పరంగా రూ. 14.05 లక్షల కోట్లు, సంఖ్యా పరంగా 870 కోట్లుగా నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన 2022, ఏప్రిల్‌తో పోలిస్తే లావాదేవీలు సంఖ్యా పరంగా 59 శాతం, విలువ పరంగా 44 శాతం పెరిగాయి.

గతేడాది ఇదే నెలలో 558 కోట్ల లావాదేవీలు జరగ్గా, విలువ పరంగా రూ. 9.8 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏడాది చివర్లో లావాదేవీలు ఊపందుకోవడం, ముఖ్యంగా పెట్టుబడులు, చిన్న మొత్తం కొనుగోళ్లు, ఆన్‌లైన్ చెల్లింపులు ఊపందుకోవడం వంటి అంశాలు యూపీఐ లావాదేవీల వృద్ధికి కారణమని ఎన్‌పీసీఐ వెల్లడించింది.

గతంలో కంటే ఏప్రిల్ నెలలో డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ, 2022 మార్చి కంటే ఐఎంపీఎస్ సేవలు స్వల్పంగా తగ్గాయి. గతేడాది మార్చిలో 49.7 కోట్ల లావాదేవీలతో రూ. 5.46 లక్షల కోట్ల ఐఎంపీఎస్ చెల్లింపులు జరిగాయి. గత నెలలో 49.6 కోట్ల లావాదేవీలతో రూ. 5.21 లక్షల కోట్ల ఐఎంపీఎస్ చెల్లింపులు నమోదైనట్టు ఎన్‌పీసీఐ పేర్కొంది.



Next Story

Most Viewed