రూ. లక్ష కోట్ల మార్కు దాటిన యూబీఐ

by Dishanational1 |
రూ. లక్ష కోట్ల మార్కు దాటిన యూబీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు మెరుగైన పనితీరుతో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ల ర్యాలీ మద్దతుతో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో ర్యాలీ ఊహించిన దానికంటే వేగంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) అరుదైన ఘనతను సాధించింది. రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువ సాధించిన నాలుగో పీఎస్‌బీగా నిలిచింది. ఇప్పటివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు మాత్రమే ఈ ఘనతను సాధించాయి. వరుస త్రైమాసికాల్లో బ్యాంకు మెరుగైన లాభాలను సాధించడం, మెరుగైన బ్యాలెన్స్ షీట్‌, క్రెడిట్ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఆస్తుల నాణ్యత కారణంగా యూబీఐ ఇన్వెస్టర్లకు లాభాల పంట అందిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో యూబీఐ షేర్ ధర సుమారు 50 శాతం పుంజుకుంది. 2024లోనే ఇప్పటివరకు బ్యాంకు షేర్ ధర 15 శాతం మేర పుంజుకోవడం విశేషం.

Next Story