35 శాతం పడిపోయిన వాహనాల ఎగుమతులు!

by Disha Web Desk 13 |
35 శాతం పడిపోయిన వాహనాల ఎగుమతులు!
X

న్యూఢిల్లీ: భారత్ నుంచి ఇతర దేశాలకు వాహనాల ఎగుమతులు గణనీయంగా క్షీణించాయని పరిశ్రమల సంఘం సియామ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆఫ్రికాతో పాటు పలు దేశాల్లో అమెరికా డాలరుతో పోలిస్తే కరెన్సీ బలహీనత కారణంగా ద్విచక్ర, ప్యాసింజర్, త్రీ-వీలర్ వాహనాల ఎగుమతులు 35 శాతం పడిపోయాయని సియామ్ తెలిపింది. గతేడాది ఫిబ్రవరిలో మొత్తం 4.63 లక్షల యూనిట్ల ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్, త్రీ-వీలర్ వాహనాలు ఎగుమతి జరగ్గా, గత నెలలో ఇది 3.01 లక్షలకు తగ్గాయి.

అందులో ద్విచక్ర వాహనాలు 37 శాతం, ప్యాసింజర్ వాహనాలు 9 శాతం, మోటార్‌సైకిళ్లు 42 శాతం, త్రీ-వీలర్లు 45 శాతం తగ్గాయి. కార్ల ఎగుమతులు 24 శాతం పడిపోయాయి. అయితే, స్కూటర్ల ఎగుమతులు 34 శాతం పెరగడం గమనార్హం. చాలా దేశాల్లో కరెన్సీ విలువ తగ్గిపోవడమే దీనికి కారణమని సియామ్ డైరెక్టర్ రాజేష్ మీనన్ అన్నారు. ఆయా దేశాలు విదేశీ నిల్వల సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, దానివల్ల వాహనాల అమ్మకాలు పరిమితం అయ్యాయని ఆయన తెలిపారు. అయినప్పటికీ ఆ ప్రాంతాల్లో వినియోగదారుల నుంచి డిమాండ్ మెరుగ్గానే ఉందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి : 'ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు మరింత మూలధనం అవసరం'!


Next Story