టూవీలర్ వాహనాల ధరలు పెంచిన EV కంపెనీలు!

by Harish |
టూవీలర్ వాహనాల ధరలు పెంచిన EV కంపెనీలు!
X

న్యూఢిల్లీ: దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు తమ స్కూటర్ల ధరలను పెంచాయి. జూన్ 1 నుంచి ప్రభుత్వం అందించే సబ్సిడీలో కోత విధించడంతో అందుకనుగుణంగా ఈవీ కంపెనీలు టీవీఎస్, ఏథర్ ఎనర్జీ, ఓలా ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఫేమ్2 పథకం ద్వారా సబ్సిడీ తగ్గిపోతున్న కారణంగా తన ఐక్యూబ్ ఈవీ ధరను రూ. 17,000 నుంచి రూ. 22,000 మధ్య పెంచినట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే, రానున్న రోజుల్లో ఫేమ్ 2 ప్రయోజనాలు క్రమంగా తగ్గుతాయి. అయినప్పటికీ ఈవీ, గ్రీన్ ఎనర్జీని విస్తరించే క్రమంలో కంపెనీ కొత్త ఈవీలను సరసమైన ధరకే తెచ్చే ప్రయత్నాలు చేస్తుందని టీవీఎస్ మోటార్ కంపెనీ సీఈఓ కీన్ రాధాకృష్ణన్ అన్నారు. ఏథర్ ఎనర్జీ సైతం తన స్కూటర్ల ధరలను సగటున రూ. 8,000 పెంచినట్టు వెల్లడించింది. సబ్సిడీ తగ్గిపోవడం వల్ల రూ. 32 వేల వరకు ప్రయోజనాలు తగ్గుతాయని, వినియోగదారులపై భారాన్ని తగ్గిస్తూ మెరుగైన నిర్ణయం తీసుకుంటున్నామని కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ చెప్పారు.

ఓలా సైతం ఒక్కో ఈవీపై రూ. 15,000 వరకు ధరలను పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. ఇక, హీరో ఎలక్ట్రిక్ ఈవీలను ప్రోత్సహిస్తూ, వినియోగదారులపై భారం వేయకూడదనే ఉద్దేశంతో ధరలను పెంచడం లేదని పేర్కొంది. కాగా, ఇటీవల ప్రభుత్వం ఈవీలపై ఇచ్చే రాయితీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో కిలోవాట్ బ్యాటరీకి ఇచ్చే రూ. 15 వేల రాయితీని రూ. 10 వేలకు, వాహన ధరలో 40 శాతం సబ్సిడీని 15 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed