తగ్గిన మారుతీ సుజుకి మార్కెట్ వాటా

by S Gopi |
తగ్గిన మారుతీ సుజుకి మార్కెట్ వాటా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ మార్కెట్లో ఎస్‌యూవీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా గతేడాది చివరి నెల ప్యాసింజర్ వాహానాల(పీవీ) అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. 2023, డిసెంబర్‌లో మొత్తం 2,93,005 పీవీ విక్రయాలు జరగ్గా, అంతకుముందు 2022, డిసెంబర్‌లో 2,85,429 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) తాజా డేటాలో వెల్లడించింది. గత నెలలో దేశవ్యాప్తంగా అమ్ముడైన పీవీల్లో సింహభాగం మారుతీ సుజుకీదే. సమీక్షించిన నెలలో కంపెనీ మొత్తం 1,18,295 వాహనాలను విక్రయించింది. అయితే, అమ్మకాలు స్థిరంగా ఉన్నప్పటికీ మార్కెట్ వాటా పరంగా మారుతీ సుజుకి 41.41 శాతం నుంచి 40.37 శాతానికి పడిపోయింది. దీని తర్వాత టాటా మోటార్స్ గత నెల 43,859 యూనిట్ల పీవీలను విక్రయించి 14.97 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2022, డిసెంబర్‌లో కంపెనీ 37,190 పీవీ యూనిట్లను విక్రయించింది. ఇక, హ్యూండాయ్ మోటార్స్ గత నెల 39,501 ప్యాసింజర్ వాహనాల(13,48 శాతం మార్కెట్ వాటా)ను, కియా మోటార్స్ ఇండియా 15,765 యూనిట్లు(5.38 శాతం), టయోటా కిర్లోస్కర్ మోటార్ 14,389 యూనిట్ల(4.91 శాతం) అమ్మకాలను వెల్లడించినట్టు ఫాడా తెలిపింది. గతేడాది ఎస్‌యూవీ వాహనాలకు అత్యధిక గిరాకీ కనిపించిందని, కంపెనీల నుంచి ఆఫర్లు, కొత్త మోడళ్లతో అమ్మకాలు ఊపందుకున్నాయని ఫాడా అద్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా అన్నారు.Next Story