TCS: మూడేళ్లలో టీసీఎస్‌లో ఉద్యోగులతో సమానంగా ఏఐ ఏజెంట్లు

by S Gopi |

ప్రపంచవ్యాప్తంగా సంస్థలు టెక్నాలజీపై ఖర్చును పెంచుతున్నాయని, అందులో ఏఐ ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు.

TCS: మూడేళ్లలో టీసీఎస్‌లో ఉద్యోగులతో సమానంగా ఏఐ ఏజెంట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: రాబోయే మూడేళ్లలో టీసీఎస్‌లో పనిచేసే ఉద్యోగులతో సమానంగా ఏఐ ఏజెంట్లు కూడా ఉంటారని ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. సంస్థ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ, కంపెనీ చరిత్రలోనే అత్యంత కీలకమైన నిర్మాణ దశ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంస్థలు టెక్నాలజీపై ఖర్చును పెంచుతున్నాయని, అందులో ఏఐ ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు. ముఖ్యంగా ఇప్పటివరకు ఐటీ సేవలు పెద్దగా వినియోగించని సంస్థలు కూడా ఏఐ కారణంగా టీసీఎస్ వంటి కంపెనీల సహాయం కోరుతున్నందున మార్కెట్ విస్తరిస్తోందని వివరించారు. ప్రస్తుతం టీసీఎస్‌కు ఏఐ ఆధారిత వార్షిక ఆదాయం 2.4 బిలియన్ డాలర్ల(రూ. 22.8 వేల కోట్ల)కు చేరిందని, అది వేగంగా పెరుగుతోందని ఆయన వెల్లడించారు.

ఏఐ వస్తే ఐటీ సేవల పరిశ్రమకు ముప్పు ఏర్పడుతుందనే ఆందోళనలను చంద్రశేఖరన్ కొట్టిపారేయలేదు. అయితే ఏఐని కేవలం ఉద్యోగాలను తగ్గించే సాధనంగా చూడటం పొరపాటని అన్నారు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, నిర్వహణలో మానవ శ్రమ అవసరాన్ని ఏఐ తగ్గించినా, అదే సమయంలో కొత్త బిజినెస్ మోడల్స్, కొత్త సేవలు, కొత్త మార్కెట్లను కూడా సృష్టిస్తోంది. అన్ని విభాగాల్లో టీసీఎస్ ఇప్పటికే ప్రాజెక్టులు అమలు చేస్తోందని ఆయన చెప్పారు. ఇదే సమయంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశం టీసీఎస్‌కు లేదు. ఉద్యోగులతో కలిసి ఏఐ ఏజెంట్లు పనిచేయడం పెరుగుతుంది. ఫలితంగా కొత్త స్కిల్స్‌కు డిమాండ్ ఉంటుందని చంద్రశేఖరన్ వెల్లడించారు.

Next Story