'జాబ్ స్కామ్' వ్యవహారంలో 16 మంది ఉద్యోగులను తొలగించిన టీసీఎస్!

by Disha Web Desk 10 |
జాబ్ స్కామ్ వ్యవహారంలో 16 మంది ఉద్యోగులను తొలగించిన టీసీఎస్!
X

బెంగళూరు: ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఏడాది ప్రారంభంలో వెలుగులోకి వచ్చిన 'జాబ్ స్కామ్'కు సంబంధించి దర్యాప్తును పూర్తి చేసినట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ వ్యవహారంలో కంపెనీలోని 16 మంది ఉద్యోగులను తొలగించామని, ఆరు వ్యాపార అసోసియేట్ సంస్థలను, ఆరు వెండర్ ఎంటిటీలు, వాటి యజమానులు, అనుబంధ సంస్థలను కూడా కంపెనీ భవిష్యత్తులో ఎలాంటి వ్యాపారం చేయకుండా నిషేధించినట్టు పేర్కొంది. లంచం తీసుకుని ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఈ కుంభకోణంలో వీరికి భాగస్వామ్యం ఉన్నట్టు గుర్తించామని స్పష్టం చేసింది. కంపెనీ దర్యాప్తులో 19 మంది ఉద్యోగులు ఈ వ్యవహారంలో పాల్గొన్నట్టు తేలింది. అందులో 16 మందిపై నిబంధనల ఉల్లంఘన, ముగ్గురిని రిసోర్స్ మేనేజ్‌మెంట్ వ్యవహారాల నుంచి తొలగించారు. వెండర్ ఎంటిటీలతో కలిసి ఉద్యోగులు నియామకాల్లో కుంభకోణం చేశారు. ఈ విషయంలో జూన్ నెలలో బయటపడగా, కంపెనీ ప్రాథమిక దర్యాప్తు మొదలుపెట్టింది. నాలుగు నెలల పాటు జరిగిన దర్యాప్తులో ఉద్యోగులకు పెద్ద ఎత్తున లంచాలు అందినట్టు తేలింది. అయితే, ఈ కుంభకోణంలో మేనేజర్ స్థాయి ఉద్యోగులకు సంబంధం లేదని, కంపెనీకి సైతం ఎటువంటి ఆర్థిక నష్టం జరగలేదని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో టీసీఎస్ వివరించింది. భవిష్యత్తులో ఇటువంటిని పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనున్నట్టు కంపెనీ పేర్కొంది.

Next Story

Most Viewed