అరుదైన రికార్డు సాధించిన టాటా గ్రూప్

by S Gopi |
అరుదైన రికార్డు సాధించిన టాటా గ్రూప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత వ్యాపార రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న టాటా గ్రూప్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. భారత కంపెనీల్లో మరే కంపెనీ కూడా సాధించని ఘనతను దక్కించుకుంది. మొట్టమొదటి సారిగా టాటా గ్రూప్ మార్కెట్ విలువ రూ. 30 లక్షల కోట్లను అధిగమించింది. గత కొన్నాళ్లుగా టాటా గ్రూప్‌లోని టీసీఎస్, టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్ షేర్లు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడంతో ఈ మైలురాయిని సాధించింది. గ్రూప్ కంపెనీల్లో ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 9 శాతం పుంజుకుంది. వాహన తయారీలోని టాటా మోటార్స్ ఏకంగా 20 శాతం, టాటా పవర్ 18 శాతం, ఇండియన్ హోటల్స్ 16 శాతం మేర రాణించాయి. గ్రూపులోని మొత్తం 24 కంపెనీలు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవగా, 3-30 శాతం మధ్య ర్యాలీ చేశాయి. టాటా ఎలెక్సీ, టాటా కెమికల్స్, తేజస్ నెట్‌వర్క్ లాంటి కొన్ని కంపెనీల షేర్లు మాత్రం సుమారు 10 శాతం వరకు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక, టాటా గ్రూప్‌లో కీలకమైన ఐటీ సంస్థ టీసీఎస్ మొత్తం గ్రూప్ మార్కెట్ విలువలో అత్యధిక భాగాన్ని కలిగి ఉంది. ఇటీవల డిసెంబర్ త్రైమాసికంలోనూ కంపెనీ అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. మంగళవారం ట్రేడింగ్‌లోనూ కంపెనీ షేర్ దాదాపు 4 శాతం పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 15 లక్షల కోట్లను దాటింది. గత కొంతకాలంగా ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ కారణంగా టాటా మోటార్స్ సైతం అమ్మకాల్లో దూకుడుగా ఉంది. ముఖ్యంగా ఈవీ రంగంలో కంపెనీ ఎక్కువ శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకోవడంతో రాణిస్తోంది.Next Story

Most Viewed