అరుదైన రికార్డు సాధించిన మొదటి డిటర్జెంట్ బ్రాండ్‌గా సర్ఫ్ ఎక్స్ఎల్!

by Harish |
అరుదైన రికార్డు సాధించిన మొదటి డిటర్జెంట్ బ్రాండ్‌గా సర్ఫ్ ఎక్స్ఎల్!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందూస్తాన్ యూనిలీవర్‌కు చెందిన డిటర్జెంట్ బ్రాండ్ సర్ఫ్ ఎక్సెల్ అరుదైన రికార్డును నమోదు చేసింది. 2022లో నమోదైన వార్షిక అమ్మకాల ద్వారా సర్ఫ్ ఎక్సెల్ 1 బిలియన్ డాలర్ల(రూ. 8,267 కోట్ల) విలువైన బ్రాండ్‌గా నిలిచింది. ఈ ఘనతను సాధించిన మొదటి భారత గృహ, వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్‌గా అవతరించింది. అలాగే, ఈ మైలురాయిని చేరుకున్న మొదటి హిందూస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) బ్రాండ్‌గా కూడా నిలిచింది.

లిక్విడ్ డిటర్జెంట్లు, ఫ్యాబ్రిక్ కండీషనర్ వంటి విభాగాల్లో ఉత్పత్తులను తీసుకురావడం ద్వారా ఇది సాధించగలిగామని హెచ్‌యూఎల్‌లోని హోమ్‌కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్ సుబ్రమణియన్ అన్నారు. సర్ఫ్ ఎక్సెల్ ఈ మార్కుకు చేరుకోవడంలో మార్కెటింగ్, కొత్త ఆవిష్కరణలు ఎంతో దోహద పడ్డాయన్నారు. సర్ఫ్ ఎక్సెల్ కాకుండా హెచ్‌యూఎల్ పోర్ట్‌ఫోలియోలో రిన్, సన్‌లైట్ వంటి ఇతర డిటర్జెంట్ కేర్ బ్రాండ్‌లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి భారత డిటర్జెంట్ మార్కెట్లో 43 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.

ఇటీవలి కాలంలో రూ. 10 ప్యాకెట్లకు డిమాండ్ పెరగడం వల్ల ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పటికీ సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలు 32 శాతం పెరిగాయి. హెచ్‌యూఎల్ సంస్థ దేశంలో ఆరు దశాబ్దాలుగా ఉంది. సర్ఫ్ ఎక్సెల్‌కు ఘడీ వంటి డిటర్జెట్ నుంచి 2012 తర్వాత గట్టి పోటీ ఎదురైంది. అయినప్పటికీ గత మూడేళ్లుగా ఈ బ్రాండ్ దేశీయ డిటర్జెంట్ మార్కెట్లో లీడర్‌గా కొనసాగుతోంది.

Next Story