స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 17 |
స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో స్వల్ప నష్టాలు నమోదయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా పరిణామాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఉదయం నుంచి లాభనష్టాల మధ్య కదలాడిన సూచీలు ద్రవ్యోల్బణం మరికొంత కాలం గరిష్ట స్థాయిలోనే కొనసాగుతుందనే అంచనాలు, తద్వారా వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుందని సంకేతాలతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. మిడ్-సెషన్ సమయం నుంచి కొంతసేపు లాభాల్లో ర్యాలీ అయిన తర్వాత చివరి గంటలో కీలక రంగాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధపడటంతో సూచీలు నష్టాల్లోకి జారాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 18.82 పాయింట్లు నష్టపోయి 60,672 వద్ద, నిఫ్టీ 17.90 పాయింట్లు కోల్పోయి 17,826 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ రంగాలు మినహా అన్ని నీరసించాయి. బ్యాంకింగ్ రంగం షేర్లలో అధిక ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, రిలయన్స్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, అల్ట్రా సిమెంట్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.81 వద్ద ఉంది.

Next Story