పైలట్ల జీతాలను 20 శాతం పెంచనున్న స్పైస్‌జెట్!

by Disha Web Desk 6 |
పైలట్ల జీతాలను 20 శాతం పెంచనున్న స్పైస్‌జెట్!
X

న్యూఢిల్లీ: ఇటీవల దాదాపు 80 మంది పైలట్లను మూడు నెలల పాటు వేతనం లేని సెలవుపై పంపిన దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలోని మిగిలిన సీనియర్ పైలట్ల జీతాలను అక్టోబర్ నుంచి 20 శాతం పెంచనున్నట్టు గురువారం ప్రకటనలో వెల్లడించింది. దేశీయ విమానయాన రంగంలో కొత్తగా వచ్చిన ఆకాశ ఎయిర్ సంస్థతో పాటు కార్యకలాపాలను పునరుద్ధరించిన జెట్ ఎయిర్‌వేర్ పైలట్ల నియామకాల కోసం అధిక జీతాలిచ్చేందుకు సిద్ధమవడంతో సీనియర్ పైలట్లకు గిరాకీ భారీగా పెరిగింది. ఈ కారణంగానే కంపెనీ సీనియర్ల జీతాలు పెంచేందుకు సిద్ధమైంది.

'సంస్థ వ్యాపారం మెరుగుపడుతున్న కారణంగా జీతాలను పెంచాలనే నిర్ణయం తీసుకున్నాం. అక్టోబర్‌లో కంపెనీ కెప్టెన్‌లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు దాదాపు 20 శాతం వేతనం పెరుగుతుందని ' స్పైస్‌జెట్ విమాన కార్యకలాపాల సీనియర్ వైస్-ప్రెసిడెంట్ గుర్చరన్ అరోరా పైలట్లకు పంపిన మెయిల్‌లో తెలిపారు. స్పైస్‌జెట్ సంస్థ గత నాలుగేళ్లుగా నష్టాలను చూస్తోంది. దీనికితోడు జూలైలో విమానాల భద్రతా ఉల్లంఘనల కారణంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) 50 శాతం విమానాలను మాత్రమే నడపాలని ఆదేశాలిచ్చింది. దీన్ని అక్టోబర్ చివరి వరకు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చింది కూడా. కాగా, ఈ వారంలోనే స్పైస్‌జెట్ సంస్థ త్వరలో కొత్త 737 మ్యాక్స్ విమానాలను అందుబాటులోకి తీసుకొస్తామని, అంతేకాకుండా వేతనం లేని సెలవుపై పంపిన ఉద్యోగులను తిరిగి తీసుకుంటామని వెల్లడించింది.



Next Story

Most Viewed