వరుస నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

by Dishanational1 |
వరుస నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. గత నాలుగు రోజులుగా బలహీనపడిన సూచీలు శుక్రవారం ఉదయం కూడా ఒత్తిడిలోనే మొదలయ్యాయి. అయితే, మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు సానుకూలంగా మారడంతో లాభాలకు మారాయి. ప్రధానంగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ఒత్తిడి కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ 1 శాతం మేర క్షీణించాయి. కానీ మిడ్-సెషన్ తర్వాత కనిష్టాల వద్ద కొనుగోళ్ల జోరు, గ్లోబల్ బలహీనత ఉన్నప్పటికీ ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీసుకున్న చర్యల తరువాత పరిమిత కాలానికి రాబడిని మదుపర్లు ఆశించిన నేపథ్యంలో సూచీలు పుంజుకున్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 599.34 పాయింట్లు లాభపడి 73,088 వద్ద, నిఫ్టీ 151.15 పాయింట్లు పెరిగి 22,147 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, మారుతీ సుజుకి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. హెచ్‌సీఎల్ టెక్, నెస్లె ఇండియా, టీసీఎస్, ఎల్అండ్‌టీ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.46 వద్ద ఉంది.

Next Story

Most Viewed