వరుసగా నాలుగోరోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
వరుసగా నాలుగోరోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు కొనసాగుతున్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుతో నిఫ్టీ సూచీ కొత్త జీవిత కాల గరిష్ఠం 22,440 పాయింట్లను తాకింది. గ్లోబల్ మార్కెట్లతో పాటు కీలక రంగాల షేర్లలో ర్యాలీ ఉన్నప్పటికీ గరిష్ఠాల వద్ద మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఇటీవల ప్రభుత్వ గణాంకాల్లో భారత జీడీపీ ఊహించిన దానికంటే ఎక్కువ వృద్ధి నమోదవడం వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పుంజుకుంది. ఊగిసలాట ఉన్నప్పటికీ చివరి గంటలో రాణించడంతో సూచీలు వరుసగా నాలుగవ రోజు లాభపడ్డాయి. సోమవారం ట్రేడింగ్‌లో రిలయన్స్ షేర్ ధర రూ. 3 వేల మార్కును దాటింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 66.14 పాయింట్లు లాభపడి 73,872 వద్ద, నిఫ్టీ 27.20 పాయింట్ల లాభంతో 22,405 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎనర్జీ, ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభాలను సాధించాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, ఆల్ట్రా సిమెంట్, ఇన్ఫోసిస్, టైటాన్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.89 వద్ద ఉంది.Next Story

Most Viewed