Business News: మళ్లీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 17 |
Business News: మళ్లీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాలను చూశాయి. ప్రధానంగా అమెరికా ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో గ్లోబల్ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు సైతం ప్రభావితం అయ్యాయి. అంతేకాకుండా ఫెడ్ సమావేశం అనంతరం, దాని ఛైర్మన్ జెరోమ్ పావెల్, భవిష్యత్తులోనూ ఇదే తరహాలో కఠినంగా నిర్ణయాలు తీసుకుంటామని, తద్వారా ఆర్థిక మాంద్యం నుంచి బయటపడగలమని వ్యాఖ్యానించారు.

ఈ కారణంతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. మిడ్-సెషన్ సమయంలో భారత ఈక్విటీ మార్కెట్లు కోలుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ గరిష్ఠాల వద్ద తిరిగి అమ్మకాలు పెరగడంతో చివరికి నష్టాల్లోనే నిలిచాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 337.06 పాయింట్లు పతనమై 59,119 వద్ద, నిఫ్టీ 88.55 పాయింట్లు క్షీణించి 17,629 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలు బలపడగా, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఐటీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, హిందూస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్, మారుతీ సుజుకి, ఐటీసీ షేర్లు లాభాలను దక్కించుకోగా, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రా సిమెంట్, కోటక్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి.

రూపాయి పతనం..

అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ రికార్డు కనిష్ట స్థాయి రూ. 80.89కి పతనమైంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో రూపాయి విలువ బలహీనపడింది. దీనికితోడు భారత స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న తీవ్ర ఒడిదుడుకులు కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయి.

గురువారం నాటి ట్రేడింగ్‌లో ఏకంగా 92 పైసలు నష్టపోయి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 80.89 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. అంతకుముందు బుధవారం రూపాయి 22 పైసలు పడిపోయి రూ. 79.96 వద్ద ఉంది.


Next Story

Most Viewed