సరికొత్త రికార్డు గరిష్ఠాలతో స్టాక్ మార్కెట్ల ర్యాలీ

by S Gopi |
సరికొత్త రికార్డు గరిష్ఠాలతో స్టాక్ మార్కెట్ల ర్యాలీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత షేర్ మార్కెట్లు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని సరికొత్త గరిష్ఠాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు విదేశీ మదుపర్లు భారత ఈక్విటీల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపించడంతో సూచీలు భారీ లాభాలను సాధించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 74, 254, నిఫ్టీ 22,529 పాయింట్ల వద్ద జీవితకాల గరిష్ఠాలను తాకాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్ రంగాల్లో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 363.20 పాయింట్లు లాభపడి 74,014 వద్ద, నిఫ్టీ 135.10 పాయింట్ల లాభపడి 22,462 వద్ద ముగిసింది. నిఫ్టీలో మీడియా ఏకంగా 4.69 శాతం, మెటల్ 3.70 శాతం పుంజుకోగా, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఆల్ట్రా సిమెంట్, ఎన్‌టీపీసీ, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, విప్రో కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. టైటాన్, నెస్లె ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, ఐటీసీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.39 వద్ద ఉంది. స్టాక్ మార్కెట్ల రికార్డు ర్యాలీతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 6.27 లక్షల కోట్లు పెరిగి రూ. 393.24 లక్షల కోట్లకు చేరుకుంది.Next Story

Most Viewed