ఈక్విటీ మార్కెట్లలో రికార్డు లాభాలు.. కొత్త గరిష్ఠాలను తాకిన సూచీలు!

by Disha Web |
ఈక్విటీ మార్కెట్లలో రికార్డు లాభాలు.. కొత్త గరిష్ఠాలను తాకిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రికార్డు లాభాలు నమోదయ్యాయి. గురువారం ట్రేడింగ్‌లో రోజంతా స్వల్ప లాభాలతో కదలాడిన సూచీలు చివరి గంటలో కొనుగోళ్ల జోరుతో కొత్త రికార్డు గరిష్ఠాలను సాధించాయి. వరుసగా మూడోరోజు మెరుగైన ర్యాలీ చూసిన బెంచ్‌మార్క్ సూచీల్లో సెన్సెక్స్ కొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకగా, నిఫ్టీ 52 వారాల గరిష్ఠాన్ని చూసింది.

ముఖ్యంగా అమెరికా ఫెడ్ వివరాలు వెలువడిన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు దూసుకెళ్లాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు విషయంలో కొంత దూకుడు తగ్గించవచ్చనే సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లు ఊపందుకున్నాయి. దీంతో అమెరికా మార్కెట్లతో పాటు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు సైతం ఉత్సాహంగా ట్రేడయ్యాయి. దీనికితోడు ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 85 డాలర్ల కంటే తక్కువకు చేరుకోవడంతో ఇన్వెస్టర్లలో జోరు పెరిగింది.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 762.10 పాయింట్లు ఎగసి 62,272 వద్ద, నిఫ్టీ 216.85 పాయింట్లు పుంజుకుని 18,484 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ రంగం ఏకంగా 3 శాతం వరకు ర్యాలీ చేయగా, ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ రంగాలు బలపడ్డాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, పవర్‌గ్రిడ్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, ఎంఅండ్ఎం కంపెనీల షేర్లు మెరుగ్గా లాభపడ్డాయి. టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 81,67 వద్ద ఉంది.

Next Story

Most Viewed