వరుస లాభాల తర్వాత నష్టపోయిన సూచీలు!

by Disha Web Desk 17 |
వరుస లాభాల తర్వాత నష్టపోయిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాల తర్వాత నీరసించాయి. పండుగ సెలవు తర్వాత మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు ఉదయం కొద్దిసేపు లాభాల్లో ర్యాలీ అయిన తర్వాత చివరి వరకు ఒడిదుడుకుల్లోనే కదలాడాయి. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకోవడం, రూపాయి మారకం బలహీనపడటం, ముడి చమురు ధరలు పెరిగిన కారణంగా స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది.

దీనికితోడు అంతకుముందు ఏడు సెషన్లు సానుకూలంగా ర్యాలీ నేపథ్యంలో లాభాల స్వీకరణ కనబడిందని విశ్లేషకులు తెలిపారు. పైగా అంతర్జాతీయ మార్కెట్లలో సైతం మిశ్రమ ట్రేడింగ్ వల్ల దేశీయ సూచీలపై ప్రభావం కనబడింది.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 287.70 పాయింట్లు నష్టపోయి 59,543 వద్ద, నిఫ్టీ 74.40 పాయింట్లు తగ్గి 17656 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్స్ రంగాలు బలహీనపడగా, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ రంగాలు పుంజుకున్నాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, ఎల్అండ్‌టీ, డా.రెడ్డీస్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. నెస్లే ఇండియా, హిందూస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్ స్టాక్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.82 వద్ద ఉంది.



Next Story

Most Viewed