73,000 దిగువకు సెన్సెక్స్

by Dishanational1 |
73,000 దిగువకు సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లు ఈవారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. గతవారం ఒడిదుడుకుల మధ్య ర్యాలీ చేసిన సూచీలు సోమవారం ట్రేడింగ్‌లోనూ బలహీనంగానే కదలాడాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ రంగాల్లో అమ్మకాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్లు ఆర్థిక గణాంకాలవైపు దృష్టి సారించడంతో ర్యాలీ పెద్దగా జరగలేదు. భారత్‌తో పాటు యూఎస్ జీడీపీ డేటా, యూరప్ ద్రవ్యోల్బణ గణాంకాలు, యూఎస్ నిరుద్యోగ డేటా వంటి అంశాల వల్ల పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 352.67 పాయింట్లు నష్టపోయి 72,790 వద్ద, నిఫ్టీ 90.65 పాయింట్లు క్షీణించి 22,122 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ బ్యాంక్, మెటల్, ఫార్మా రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, పవర్‌గ్రిడ్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, నెస్లె ఇండియా కంపెనీల షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకున్నాయి. మిగిలిన అన్నీ బలహీనపడ్డాయి. ముఖ్యంగా ఏషియన్ పెయింట్, టాటా స్టీల్, టైటాన్, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.87 వద్ద ఉంది.


Next Story

Most Viewed