నిరాశ పరిచిన బడ్జెట్.. నష్టాల్లో మార్కెట్లు

by Dishanational1 |
నిరాశ పరిచిన బడ్జెట్.. నష్టాల్లో మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం బడ్జెట్ ప్రకటన వేళ నష్టాలను చూశాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రధాన ప్రకటనలు లేకుండా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, ఆశించిన నిర్ణయాలు లేకపోవడంతో సూచీలు రోజంతా ఊగిసలాట ధోరణిలోనే కదలాడాయి. గతేడాది బడ్జెట్ సమయంలోనూ మార్కెట్లలో ఇదే తరహా ర్యాలీ జరగడం గమనార్హం. కీలక స్థిరాస్తి, మౌలిక, విమానయాన, రైల్వే రంగాలకు కేటాయింపులు పెంచడంతో వాటి షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. బడ్జెట్ ప్రకటన ముగిసిన తర్వాత మిడ్-సెషన్ సమయం నుంచి పతనమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 106.81 పాయింట్లు నష్టపోయి 71,645 వద్ద, నిఫ్టీ 28.25 పాయింట్లు కోల్పోయి 21,697 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగం మాత్రమే అత్యధికంగా 3 శాతానికి పుంజుకుంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్ షేర్లు రాణించాయి. మెటల్, ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మీడియా, ఐటీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి. ఆల్ట్రాసిమెంట్, ఎల్అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, నెస్లె ఇండియా, విప్రో కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.97 వద్ద ఉంది.



Next Story