స్వల్ప లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు

by Dishanational1 |
స్వల్ప లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. అంతకుముందు రెండు సెషన్లలో మెరుగైన లాభాలను చూసిన సూచీలు గురువారం ట్రేడింగ్‌లో రోజంతా సానుకూలంగానే కదలాడాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు కీలక రిలయన్స్ షేర్లలో కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. కీలకమైన యూఎస్ ద్రవ్యోల్బణం డేటా వెల్లడి కానుండటం, ఇంధనం, ఆటో స్టాక్స్ రాణించడంతో మార్కెట్లు పెరిగాయి. మిడ్‌సెషన్ తర్వాత కొంత అమ్మకాల ఒత్తిడి కారణంగా లాభాలు తగ్గాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 63.47 పాయింట్లు లాభపడి 71,721 వద్ద, నిఫ్టీ 28.50 పాయింట్ల లాభంతో 21,647 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, ఫైనాన్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్ వరుస సెషన్లలో రెండున్నర శాతానికి పైగా పుంజుకుంది. యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనిలీవర్, విప్రో, ఎల్అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నెస్లె ఇండియా, సన్‌ఫార్మా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.02 వద్ద ఉంది.

Next Story

Most Viewed