వారాంతం నష్టాల్లో ముగిసిన సూచీలు!

by Disha Web Desk 17 |
వారాంతం నష్టాల్లో ముగిసిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికాలో ప్రతికూల పరిణామాల వల్ల ఐటీ రంగం షేర్లు దెబ్బతింటాయనే సంకేతాలు, ఇతర కీలకమైన ఫైనాన్స్, రియల్టీ రంగాల షేర్లలో అమ్మకాలు ఊపందుకోవడం వంటి అంశాలు సూచీల నష్టాలకు కారణాలుగా నిలిచాయి. శుక్రవారం ఉదయం కొద్దిసేపు లాభాల్లో కదలాడిన స్టాక్ మార్కెట్లు మిడ్-సెషన్‌కు ముందు నష్టాల్లోకి జారిపోయాయి.

గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతు ఉన్నప్పటికీ, దేశీయంగా సూచీలు గరిష్ఠాలకు చేరడం, కీలక కంపెనీల షేర్లలో ఒత్తిడి కారణంగా నష్టాలు ఎదురయ్యాయి. హెచ్‌సీఎల్ టెక్ షేర్ ధర దాదాపు 7 శాతం పతనమైంది. దీనికి తోడు పెరుగుతున్న ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం వంటి అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌ను మరింత ప్రభావితం చేశాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 389.01 పాయింట్లు నష్టపోయి 62,181 వద్ద, నిఫ్టీ 112.75 పాయింట్లు పడిపోయి 18,496 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు రాణించగా, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు బలహీనపడ్డాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో నెస్లే ఇండియా, టైటాన్, సన్‌ఫార్మా, డా.రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకోగా, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.30 వద్ద ఉంది.


Next Story