790 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

by Dishanational1 |
790 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లలో భారీ నష్టాలు నమోదయ్యాయి. అంతకుముందు సెషన్‌లో లాభాలను చూసిన సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడం, దేశీయంగా గరిష్ట స్థాయిల వద్ద మదుపర్లు లాభాలను తీసుకోవడంతో అధిక నష్టాలు తప్పలేదు. ప్రధానంగా, అమెరికాలో కీలక గణాంకాలు, వడ్డీ రేట్లకు సంబంధించి ఫెడ్ నిర్ణయాలు ప్రభావితం చేశాయి. అలాగే, ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో నష్టాలు, విదేశీయ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకొవడం వంటి పరిణామాలు స్టాక్ మార్కెట్ల ర్యాలీని దెబ్బతీశాయి. ఇదే సమయంలో కీలక రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సహా ఇతర స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాలు పెరిగాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 790.34 పాయింట్లు కుదేలై 72,304 వద్ద, నిఫ్టీ 247.20 పాయింట్లు నష్టపోయి 21,951 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, బ్యాంకింగ్, రియల్టీ, మెటల్ సహా అన్ని రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, టీసీఎస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకున్నాయి. మిగిలిన అన్నీ పతనమయ్యాయి. ముఖ్యంగా పవర్‌గ్రిడ్, మారుతీ సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్, టాటా స్టీల్, రిలయన్స్ స్టాక్స్ 2-5 శాతం నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.92 వద్ద ఉంది.

భారీ నష్టాల కారణంగా మదుపర్లు బుధవారం ట్రేడింగ్‌లో ఒక్కరోజే రూ. 6.04 లక్షల కోట్లు కోల్పోయారు. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 385.95 లక్షల కోట్లకు చేరింది.


Next Story

Most Viewed