స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలకు బ్రేక్!

by Disha Web Desk 17 |
స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలకు బ్రేక్!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్ల లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. వరుస ఐదురోజుల లాభాల పరంపరతో సెన్సెక్స్ నాలుగు నెలల తర్వాత 60 వేల కీలక మార్కును తాకింది. అయితే, ఒక్క రోజు వ్యవధిలోనే సెన్సెక్స్ భారీ నష్టాలతో తిరిగి 60 వేల దిగువకు పడిపోయింది. వారాంతం ట్రేడింగ్‌లో ఉదయం ప్రారంభంలో మెరుగైన లాభాల్లో కదలాడిన సూచీలు ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాలకు మారాయి.

ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల ఒత్తిడి, దేశీయంగా మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం వంటి పరిణామాలతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చూశాయి. జూన్ నెలలో నమోదైన కనిష్టాల నుంచి నిఫ్టీ ఇండెక్స్ ఇప్పటివరకు 18 శాతం పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాలను తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. దీనికితోడు డాలర్ నెల గరిష్ఠానికి చేరడం పెట్టుబడిదారుల్లో భయాలు పెంచింది.

మరోవైపు దేశీయంగా ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు తీసుకున్నప్పటికీ, ఇంకా పెంపు ఉంటుందని మదుపర్లు భావిస్తున్నారు. అలాగే, డీజిల్, విమాన ఇంధనం ఎగుమతులపై ఎగుమతి సుంకం పెంచడంతో పరిస్థితులు ప్రతికూలంగా మారాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 651.85 పాయింట్లు పతనమై 59,646 వద్ద, నిఫ్టీ 198.05 పాయింట్లు నష్టపోయి 17,758 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ రంగం మాత్రమే బలపడగా, రియల్టీ, బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్స్ రంగాలు అధికంగా బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని షేర్లు దెబ్బతిన్నాయి. అత్యధికంగా ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, మారుతీ సుజుకి, హిందుస్తాన్ యూనిలీవర్, రిలయన్స్, ఎం అండ్ ఎం స్టాక్స్ 1.50-4 శాతం మధ్య నష్టాలను నమోదు చేశాయి.

అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 79.89 వద్ద ఉంది.


Next Story

Most Viewed