ఇళ్ల రుణాలపై తక్కువ వడ్డీ ఆఫర్‌ను పొడిగించిన ఎస్‌బీఐ!

by Dishanational4 |
ఇళ్ల రుణాలపై తక్కువ వడ్డీ ఆఫర్‌ను పొడిగించిన ఎస్‌బీఐ!
X

ముంబై: వడ్డీ రేట్లు పెరుగుతున్న ఈ సమయంలో దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఇళ్ల రుణాల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక ఆఫర్‌ 'హాలిడే ప్రమోషన్‌' గడువును పొడిగించింది. 'క్యాంపెయిన్ రేట్స్ ' పేరుతో గృహ రుణాల వడ్డీ రేట్లపై 30-40 బేసిస్ పాయింట్ల రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని, దీనివల్ల వినియోగదారులు తక్కువగా 8.60 శాతం వడ్డీతో గృహ రుణాలను పొందవచ్చని బ్యాంకు పేర్కొంది. అయితే, క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉంటాయని స్పష్టం చేసింది.

బ్యాంకు వివరాల ప్రకారం, 700-800 వరకు క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి రెసిడెన్షియల్ లోన్‌లపై 30-40 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఉంటుంది. 550-699 క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 9.20 శాతం వడ్డీతో గృహ రుణాలు లభిస్తాయి. ఇక, మహిళలకు అదనంగా 5 బేసిస్ పాయింట్ల తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా టాప్-అప్ లోన్ తీసుకునే వారికి సైతం 30 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు బ్యాంకు తెలిపింది. సాధారణ, టాప్-అప్ ఇళ్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను సైతం మాఫీ చేస్తున్నట్టు వెల్లడించింది. కాగా, ఎస్‌బీఐ గతేడాది అక్టోబర్ 4న హాలిడే ప్రమోషన్ పేరున ఈ ఆఫర్‌ను ప్రారంభించగా, జనవరి 31 తుది గడువుగా ఉండేది. తాజాగా దీన్ని మరో రెండు నెలలు పొడిగించింది.


Next Story