ఈ ఏడాది నుంచి భారత్‌లో శాంసంగ్ ల్యాప్‌టాప్‌ల తయారీ

by S Gopi |
ఈ ఏడాది నుంచి భారత్‌లో శాంసంగ్ ల్యాప్‌టాప్‌ల తయారీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ ఈ ఏడాది భారత్‌లో తన ల్యాప్‌టాప్‌ల తయారీని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. నోయిడాలోని కంపెనీ ఫ్యాక్టరీలో వీటి తయారీకి అవసరమైన పనులు జరుగుతున్నాయని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అధ్యక్షుడు, మొబైల్ ఎక్స్‌పీరియన్స్ బిజినెస్ హెడ్ టీఎం రోహ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. కంపెనీకి భారత్‌ అత్యంత ముఖ్యమైన తయారీ కేంద్రమని, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అనేక స్థాయిలలో తమకు మద్దతు లభించిస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో తయారీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వానికి తమ నుంచి సహకారం ఎప్పటికీ ఉంటుంది. కేవలం స్థానిక తయారీపైనే కాకుండా తమ పరికరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) సామర్థ్యం పెంచేలా తయారీని చేపట్టనున్నాం. ఇటీవల విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 స్మార్ట్‌ఫోన్‌ను సైతం నోయిడాలోని ఫ్యాక్టరీలోనే తయారు చేసినట్టు రోహ్ వెల్లడించారు. నోయిడాలోని తమ ఫ్యాక్టరీ శాంసంగ్‌కు రెండో అతిపెద్ద స్థావరం. అంతర్జాతీయ డిమాండ్‌కు అనుగుణంగా ప్లాంటును మార్చేందుకు అవసరమైన మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫీచర్‌ఫోన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, వేరబుల్స్, ట్యాబ్లెట్లను ఇక్కడే తయారు చేస్తున్నాం. ఈ ఏడాది నుంచి ల్యాప్‌టాప్‌లు కూడా ఈ జాబితాలో చేరనున్నాయని రోహ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story