8.4 శాతం పెరిగిన ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు: SIAM

by Disha Web Desk 17 |
8.4 శాతం పెరిగిన ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు: SIAM
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో మొత్తం ప్యాసింజర్ వెహికల్(పీవీ కార్ల)అమ్మకాలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఏడాది ప్రాతిపదికన 8.4 శాతం పెరిగి 42.18 లక్షల యూనిట్లకు చేరుకున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) పేర్కొంది. కమోడిటీ ధరలు, వాహనాల ధరలు పెరుగుతున్నప్పటికీ కూడా అమ్మకాలు గతంతో పోలిస్తే మెరుగైనట్టు డేటా చూపించింది. ముఖ్యంగా సెమీకండక్టర్ చిప్‌ల సరఫరా మెరుగవడం ద్వారా వాహనాలు వినియోగదారులకు వేగంగా డెలివరీ చేయడానికి వీలైంది. దీంతో దేశీయ ప్యాసింజర్ విభాగంలో బలమైన ఆర్థిక వృద్ధి కనబడిందని సియామ్ పేర్కొంది.

అదే సమయంలో ఎఫ్‌వై24లో ద్విచక్ర వాహనాల హోల్‌సేల్ విక్రయాలు 1.79 కోట్ల యూనిట్లుగా నమోదు కాగా, ఇది ఎఫ్‌వై23తో పోలిస్తే 13.3 శాతం ఎక్కువ. యుటిలిటీ వెహికల్స్ మొత్తం పీవీ అమ్మకాల్లో దాదాపు 60 శాతం వాటాతో 25.2 లక్షల యూనిట్ల విక్రయాలను కలిగి ఉంది. ఇది ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే 36 శాతం పెరిగిందని సియామ్ డేటా తెలిపింది. ఈ ఏడాది మార్చి నెలలో మొత్తం పీవీ అమ్మకాలు 3.18 లక్షల యూనిట్లుగా ఉన్నాయి, ఇది గత సంవత్సరం 2.92 లక్షల యూనిట్ల నుండి 8.9 శాతం పెరిగింది. సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ ఎఫ్‌వై24 కోసం 7.6 శాతం బలమైన GDP వృద్ధి ఆటోమొబైల్ పరిశ్రమ 'సంతృప్తికరమైన పనితీరు'ను నమోదు చేసిందని అన్నారు.

Next Story

Most Viewed