అరుదైన ఘనతను సాధించిన ITC

by Disha Web Desk 17 |
అరుదైన ఘనతను సాధించిన ITC
X

ముంబై: భారత ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ మార్కెట్ విలువ పరంగా అరుదైన ఘనతను సాధించింది. దేశంలోనే 7వ అతిపెద్ద భారతీయ సంస్థగా నిలిచింది. ద్రవ్యోల్బణం, గ్రామీణ మార్కెట్లో బలహీన అమ్మకాలు ఉన్నప్పటికీ కంపెనీ మెరుగ్గా రాణిస్తోంది. శుక్రవారం కంపెనీ షేర్ ధర దాదాపు 2 శాతం పెరిగి రూ. 409 వద్ద ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకి అనంతరం రూ. 408 వద్ద ముగిసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే 21 శాతం, గతేడాది కాలంలో 56 శాతం మేర పుంజుకుంది. దాంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ఈ గురువారం రూ. 5 లక్షల కోట్ల మార్కును తాకింది. ఈ మైలురాయిని చేరిన 11వ కంపెనీగా మారిన అనంతరం, శుక్రవారం హెచ్‌డీఎఫ్‌సీని అధిగమించి ఏడవ అతిపెద్ద దేశీయ కంపెనీగా ఎదిగింది.

గత మూడు సెషన్లలోనే ఐటీసీలో పెట్టుబడి పెట్టిన మదుపర్ల సంపద రూ. 11,400 కోట్లకు పైగా పెరిగింది. ఇదే సమయంలో కంపెనీ 56 శాతం రాబడిని ఇవ్వగా, ఇది మరో దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ స్టాక్ 13 శాతం రాబడిని ఇచ్చింది. గడిచిన ఏడాది కాలంలో కంపెనీ మార్కెట్ క్యాప్ 63 శాతం పెరిగింది. శుక్రవారం సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి ఐటీసీ షేర్ ధర 1.92 శాతం పెరిగి రూ. 408 వద్ద ముగియడంతో మార్కెట్ క్యాప్ రూ. 5.08 లక్షల కోట్లకు చేరింది.

Also Read...

ఇలా ఈజీగా మీ PF బ్యాలెన్స్ చెక్ చేసుకోండి


Next Story