ఐదేళ్లలో గణనీయంగా తగ్గిన విక్రయించని ఇళ్ల సంఖ్య!

by Disha Web Desk 13 |
ఐదేళ్లలో గణనీయంగా తగ్గిన విక్రయించని ఇళ్ల సంఖ్య!
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తర్వాతి పరిణామాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరగడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో విక్రయించకుండా ఉండిపోయిన గృహాల సంఖ్య తగ్గాయని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తెలిపింది. గడిచిన ఐదేళ్ల కాలంలో విక్రయించని ఇళ్లు 12 శాతం తగ్గాయని, వాటిని విక్రయించేందుకు పట్టే సమయం కూడా 20 నెలలకు పడిపోయినట్టు అనరాక్ వెల్లడించింది. అనరాక్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం, జనవరి-మార్చి నాటికి విక్రయించని ఇళ్ల సంఖ్య 6,26, 750 యూనిట్లకు తగ్గాయి. 2018, మార్చి చివరి నాటికి ఇళ్లు 7,13,400 యూనిట్లుగా ఉండేవి. ముఖ్యంగా అదే కాలంలో ఆయా ఇళ్లను విక్రయించడానికి పట్టే సమయం 42 నెలల నుంచి 20 నెలలకు పడిపోయింది.

సాధారణంగా పరిశ్రమలో ఇళ్ల అమ్మకాలకు పట్టే గడువు 18-24 నెలల మధ్య ఉంటే ఆరోగ్యకరంగా పరిగణిస్తారు. అమ్ముడుపోని ఇళ్లు(ఇన్వెంటరీ హౌసింగ్) తగ్గుముఖం పట్టడం మొత్తం పరిశ్రమకు సానుకూలమని అనరాక్ ఛైర్మన్ అనుజ్ పూరి అన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో మొత్తం 1.14 లక్షల ఇళ్లు విక్రయించకుండా ఉన్నాయి. అందులో అత్యధికంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఐదేళ్లలో ఇన్వెంటరీల అమ్మకాలకు పట్టే సమయం 66 నెలల నుంచి 23 నెలకు తగ్గింది. ముంబైలో 55 నెలల నుంచి 21 నెలలకు, బెంగళూరులో 13 నెలలకు, హైదరాబాద్‌లో 21 నెలలకు, పూణెలో 20 నెలలకు, చెన్నైలో 20 నెలలకు, కోల్‌కతాలో 20 నెలలకు తగ్గాయని నివేదిక పేర్కొంది.

Also Read..

రికార్డు స్థాయికి చేరిన స్మార్ట్ ఫోన్ ఎగుమతులు

Next Story