అదానీ గ్రూప్ చుట్టూ ఉచ్చులా హిండెన్‌బర్గ్ నివేదిక.. వివరాలు కోరిన ఆర్‌బీఐ!

by Disha Web Desk 17 |
అదానీ గ్రూప్ చుట్టూ ఉచ్చులా హిండెన్‌బర్గ్ నివేదిక.. వివరాలు కోరిన ఆర్‌బీఐ!
X

ముంబై: అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక అదానీ గ్రూప్ చుట్టూ ఉచ్చులా బిగుసుకుంటోంది. ఇప్పటికే నివేదిక కారణంగా అదానీ కంపెనీలు భారీగా నష్టపోయాయి. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) సైతం ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను అడిగినట్టు తెలుస్తోంది. కంపెనీల షేర్ల వరుస నష్టాలతో పాటు మార్కెట్ల అనిశ్చితి నేపథ్యంలో బుధవారం అదానీ గ్రూప్ సమావేశంపై ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) విషయంలో ముందుకెళ్లడాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

గురువారం ఉదయం సంస్థ అధినేత గౌతమ్ అదానీ సైతం వీడియో రూపంలో వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ అదానీ గ్రూపునకు సంబంధించి తమ అవగాహన కోసం వివరాలను ఇవ్వాలని బ్యాంకులను కోరినట్టు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దీనికి సంబంధించి ఆర్‌బీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు వరుస సెషన్లలో అదానీ కంపెనీలు షేర్లు పతనమవుతున్న కారణంగా గౌతమ్ అదానీ సంపద విలువ రోజురోజుకు క్షీణిస్తోంది.

ఫోర్బ్స్ ప్రకారం, గురువారం నాటికి అదానీ సంపద విలువ ఏకంగా 100 బిలియన్ డాలర్లు(రూ. 8.2 లక్షల కోట్లు) కరిగిపోయింది. గత ఆరు రోజుల ట్రేడింగ్‌లో మొత్తం 10 అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ 43 శాతం నష్టపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదికకు ముందు కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 19.2 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ. 10.89 లక్షల కోట్లకు తగ్గింది. అంతేకాకుండా భారత, ఆసియా సంపన్నుడిగా కూడా స్థానం కోల్పోయారు. ఫోర్బ్స్ జాబితాలో అదానీ ప్రస్తుతానికి 16వ సంపన్నుడిగా ఉన్నారు.



Next Story