Bajaj Group: బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డుకు రాజీవ్ బజాజ్ గుడ్‌బై

by S Gopi |

దీంతో రొటేషన్ పద్ధతిలో పదవీ విరమణ చేసిన తర్వాత నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆయన పదవీకాలం ముగియనుంది.

Bajaj Group: బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డుకు రాజీవ్ బజాజ్ గుడ్‌బై
X

దిశ, బిజినెస్ బ్యూరో: బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డు నుంచి తప్పుకోవాలని రాజీవ్ బజాజ్ నిర్ణయం తీసుకున్నారు. జూలై 31న జరగనున్న బజాజ్ ఫిన్‌సర్వ్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆయన పునర్నియామకాన్ని కోరవద్దని కంపెనీకి తెలియజేశారు. ఈ మేరకు కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో రొటేషన్ పద్ధతిలో పదవీ విరమణ చేసిన తర్వాత నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆయన పదవీకాలం ముగియనుంది. ఇటీవల బజాజ్ గ్రూప్‌లో కొత్త వ్యాపారాల విస్తరణ, వాటి పర్యవేక్షణ, అలాగే గ్రూప్ చేపట్టిన కీలక వ్యూహాత్మక కార్యక్రమాల కారణంగా తనపై బాధ్యతలు పెరిగాయని, అందుకే ఇతర బాధ్యతలను తగ్గించుకోవాల్సి వచ్చిందని రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. ఇది బజాజ్ గ్రూప్‌లో రాజీవ్ బజాజ్ చేపట్టిన రెండో కీలక బోర్డు నిష్క్రమణ. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆయన బజాజ్ ఫైనాన్స్ బోర్డు నుంచి కూడా వైదొలగనున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన గ్రూప్‌లోని అత్యంత కీలకమైన బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో కొనసాగుతారు. తాను పూర్తిగా ఆటోమొబైల్, ఇతర కొత్త వ్యాపారాలపైనే దృష్టిసారిస్తానని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. మూడు దశాబ్దాలకు పైగా బజాజ్ ఆటో విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న రాజీవ్ బజాజ్, సంస్థను ప్రపంచస్థాయి మోటార్‌సైకిల్, త్రీ-వీలర్ తయారీదారుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.

Next Story