మార్కెట్లోకి మారుతి సూజికి 'గ్రాండ్ విటారా' కొత్త మోడల్

by Disha Web Desk 17 |
మార్కెట్లోకి మారుతి సూజికి గ్రాండ్ విటారా కొత్త మోడల్
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి తన సరికొత్త ఎస్‌యూవీ గ్రాండ్ విటారాను భారత మార్కెట్లో విడుదల చేసింది. అలాగే, ఇదే మోడల్‌లో స్మార్ట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్‌ను కూడా ప్రకటించింది. ఎస్‌యూవీ గ్రాండ్ విటారా ధరను రూ. 10.45 లక్షల నుంచి రూ. 19.65 లక్షల(ఎక్స్‌షోరూమ్) మధ్య నిర్ణయించామని, ఇప్పటికే ఈ కారు కోసం బుకింగ్స్ ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది.

వినియోగదారులు మారుతీ సుజుకి అధికారిక డీలర్‌షిప్‌ల వద్ద రూ. 11,000 చెల్లించి బుకింగ్ ప్రక్రియ పూర్తి చేయవచ్చని కంపెనీ పేర్కొంది. కంపెనీ గ్రాండ్ విటారా బ్రాండ్‌ను భారత్‌లో విడుదలకు ముందే భారీ సంఖ్యలో ఆర్డర్లను అందుకుంది. ఇప్పటివరకు ఈ కారు కోసం 55 వేల కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయని కంపెనీ వివరించింది. ఆర్డర్లు ఎక్కువగా ఉండటంతో బుకింగ్ చేసిన వారు వాహన డెలివరీ కోసం కనీసం 5 నుంచి 6 నెలల వరకు వేచి ఉండాలని కంపెనీ తెలిపింది.

గ్రాండ్ విటారా మొత్తం ఇప్పుడు 11 వేరియంట్లలో అందుబాటులో ఉండగా, ఇవి కంపెనీకి చెందిన నెక్సా ఔట్‌లెట్ల ద్వారా మాత్రమే విక్రయించబడతాయి. కొత్త గ్రాండ్ విటారాలో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది.

పానోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.


Next Story