ఆర్థిక మాంద్యం భయాలతో మరోసారి భారీ నష్టాల్లో సూచీలు!

by Disha Web Desk 17 |
ఆర్థిక మాంద్యం భయాలతో మరోసారి భారీ నష్టాల్లో సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగా గత నాలుగు సెషన్లుగా బలహీనపడుతున్న సూచీలు సోమవారం నాటి ట్రేడింగ్‌లోనూ అదే ధోరణిని కనబరిచాయి. ప్రధానంగా గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, రూపాయి మారకం మరింత పతనం కావడం, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలను కొనసాగించడం, ఆర్థిక మాంద్యం భయాల కారణంగా మదుపర్లు రోజంతా అమ్మకాలను కొనసాగించారు. వీటికి తోడు ఈ వారం ఆఖరులో ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాల పట్ల పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 953.70 పాయింట్లు కుదేలై 57,145 వద్ద, నిఫ్టీ 311.05 పాయింట్లు దెబ్బతిని 17,016 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ రంగం మాత్రమే సానుకూలంగా ర్యాలీ చేయగా, రియల్టీ, మెటల్, ఆటో, బ్యాంకింగ్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్ షేర్లు లాభాలను దక్కించుకోగా, మారుతి సుజుకి, టాటా స్టీల్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ స్టాక్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 81.59 వద్ద ఉంది.

సరికొత్త జీవిత కాల కనిష్ఠానికి రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన పరిస్థితుల కారణంగా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం సరికొత్త జీవితకాల కనిష్టం రూ. 81.65ని తాకింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి భారత రూపాయి కరెన్సీ రూ. 81.59 వద్ద ఉంది. డాలర్ ఇండెక్స్ బలంగా కొనసాగడం, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం వల్ల ఆర్థిక వృద్ధి దెబ్బతింటుందనే ఆందోళనల మధ్య రూపాయి కరెన్సీ విలువ వరుసగా మూడవ సెషన్‌లో పతనమైంది.

రూ. 13 లక్షల కోట్లు హాంఫట్..

డాలర్ ఇండెక్స్ బలంగా ఉండటం, గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూల పరిణామాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధుల ఉపసంహరించడం వంటి పరిణామాలతో భారత ఈక్విటీ మార్కెట్లలో కేవలం నాలుగు సెషన్లలో మదుపర్ల సంపద రూ. 13 లక్షల కోట్లు ఆవిరైపోయాయి.

సోమవారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 6.59 లక్షల కోట్లు క్షీణించి రూ. 270.05 లక్షల కోట్లకు పడిపోయింది. గత రెండు సెషన్లలో మాత్రమే ఇన్వెస్టర్ల సంపద రూ. 11 లక్షల కోట్లు క్షీణించడం గమనార్హం.


Next Story

Most Viewed