నవంబర్‌లో స్వల్పంగా పుంజుకున్న తయారీ రంగ కార్యకలాపాలు!

by Dishanational2 |
నవంబర్‌లో స్వల్పంగా పుంజుకున్న తయారీ రంగ కార్యకలాపాలు!
X

న్యూఢిల్లీ: కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరుగుదలతో పాటు ద్రవ్యోల్బణ ప్రభావం నెమ్మదించడంతో ఈ ఏడాది నవంబర్‌లో భారత తయారీ రంగ కార్యకలాపాలు స్వల్పంగా పుంజుకున్నాయి. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) సూచీ నవంబర్‌లో 55.7 పాయింట్లుగా నమోదు కాగా, అంతకుముందు అక్టోబర్‌లో ఇది 55.3 పాయింట్లుగా నమోదైంది. సమీక్షించిన నెలలో ఫ్యాక్టరీ కార్యకలాపాలు మూడు నెలల గరిష్ఠానికి పెరిగాయి. ఇన్‌పుట్ ఖర్చులు రెండేళ్ల కనిష్ఠానికి పడిపోవడంతో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ స్థిరమైన డిమాండ్ కనిపిస్తోందని ఎస్అండ్‌పీ గ్లోబల్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు, వృద్ధి క్షీణత ఉన్నప్పటికీ, భారత్‌లో మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆమె తెలిపారు. సాధారణంగా పీఎంఐ సూచీ 50 పాయింట్ల కంటే ఎక్కువ నమోదైతే వృద్ధిగానూ, 50 పాయింట్ల కంటే తక్కువుంటే క్షీణతగా పరిగణిస్తారు. కొత్త ఆర్డర్లు క్రమంగా పెరుగుతుండటంతో వరుసగా పదిహేడవ నెలలో పీఎంఐ సూచీ వృద్ధిని సూచించింది. అంతేకాకుండా వరుసగా తొమ్మిదో నెలలో ఉపాధి గణనీయంగా పెరిగిందని, రానున్న 12 నెలల్లో డిమాండ్ బలంగా ఉంటుందని నివేదిక వెల్లడించింది.


Next Story