ఒకే రోజు 50 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించిన జియో!

by Disha Web |
ఒకే రోజు 50 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించిన జియో!
X

న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన 5జీ సేవలను వేగవంతంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీ, తాజాగా మంగళవారం మరో 50 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది. గత ఏడాది 5జీ సేవలు మొదలయ్యాక ఒకేసారి ఇన్ని నగరాల్లో ప్రారంభించడం ఇదే మొదటిసారి.

తాజాగా జియో 17 రాష్ట్రాల్లోని 50 నగరాల్లో వీటిని మొదలుపెట్టింది. అందులో పాండిచ్చేరి సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, గోవా, హర్యానా, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్, చత్తీష్‌గఢ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాళ్ రాష్ట్రాలున్నాయి. ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండా 1జీబీపీఎస్ వేగవంతమైన ఇంటర్నెట్‌ను సబ్‌స్క్రైబర్లు అపరిమితంగా వినియోగించవచ్చని జియో ఓ ప్రకటనలో తెలిపింది.

దీంతో జియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 184 నగరాల్లో 5జీ సేవలను అందిస్తోందని పేర్కొంది. తెలుగు రాష్టాల్లో తెలంగాణలోని నల్గొండతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్, కడప, ఒంగోలు పట్టణాల్లో జియో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి.


Next Story