2.3 శాతం తగ్గిన ఇంధన ధరలు!

by Disha Web Desk 17 |
2.3 శాతం తగ్గిన ఇంధన ధరలు!
X

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దేశీయంగా చమురు మార్కెటింగ్ సంస్థలు విమాన ఇంధన ధరలను 2.3 శాతం తగ్గించాయి. ప్రభుత్వ ఇంధన రిటైలర్ల నోటిఫికేషన్ ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధర కిలోలీటర్‌కు రూ. 2,775 లేదా 2.3 శాతం తగ్గి రూ. 1,17,587.64కి చేరుకుంది. నిర్వహణ ఖర్చులో 40 శాతం వాటా ఉన్న ఇంధన ధరలు తగ్గడంతో విమానయాన సంస్థలకు ఊరట లభించనుంది.

గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలతో పాటు విదేశీ మారక రేట్ల ఆధారంగా ఏటీఎఫ్ ధరలను ప్రతి నెలా ఒకటో తేదీన సవరిస్తారు. గత నెలలో కూడా ఏటీఎఫ్ కిలోలీటర్‌కు రూ. 4,842 తగ్గించబడింది. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో ఎనిమిదో నెలలోనూ స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.66గా ఉంది. డీజిల్ ధర రూ. 97.82గా ఉంది.

అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా వీటి ధరలను సవరించే అవకాశం ఉన్నప్పటికీ, ఈ ఏడాది మే నుంచి చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. ఇక, వంట గ్యాస్ ధరల్లో సైతం ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ రూ. 1,744గా ఉంది. ఇళ్లలో వాడే 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ. 1,053 వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంది.

Next Story