గ్లోబల్ మార్కెట్‌పై కన్నెసిన 'boAt ' బ్రాండ్!

by Disha Web Desk 16 |
గ్లోబల్ మార్కెట్‌పై కన్నెసిన boAt  బ్రాండ్!
X

న్యూఢిల్లీ: దేశీయ వేరబుల్స్ బ్రాండ్ బోట్ మాతృసంస్థ ఇమాజైన్ మార్కెటింగ్ విదేశీ మార్కెట్లకు బ్రాండ్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మేడ్-ఇన్-ఇండియా గ్లోబల్ లైఫ్‌స్టైల్ బ్రాండ్‌గా గ్లోబల్ మార్కెట్లో ఎదిగేందుకు ఈ విస్తరణ ఉపయోగపడుతుందని సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమన్ గుప్తా అన్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 60 లక్షల యూనిట్లను(ప్రస్తుత ఉత్పత్తి కంటే రెండింతలు) తయారు చేయాలని, డిమాండ్, మార్కెట్ రీచ్ పెరిగేకొద్దీ మరింత విస్తరణకు సిద్ధంగా ఉన్నామని అమన్ గుప్తా పేర్కొన్నారు.

విస్తరణ ద్వారా కొత్త ఉత్పత్తులను తెచ్చేందుకు, సరసమైన ధరలోనే వాటిని వినియోగదారుల వద్దకు చేర్చేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బోట్ బ్రాండ్ దేశంలోని వేరబుల్ ఉత్పత్తుల మార్కెట్లో 40 శాతం వాటాతో వరుసగా మూడో ఏట ఆధిపత్యాన్ని కలిగి ఉందని ఐడీసీ ఇండియా ఆగష్టు నివేదిక తెలిపింది. 2013లో ముంబైకి చెందిన అమన్ గుప్తా, సమీర్ మెహతా ఇమాజైన్ మార్కెటింగ్‌ను స్థాపించారు.

వీరు బోట్ బ్రాండ్ ద్వారా ఆడియో పరికరాలు, స్మార్ట్ వేరబుల్స్, మొబైల్ పరికరాలను తయారు చేస్తున్నారు. కంపెనీ ప్రధాన విభాగమైన ఆడియో, వేరబుల్స్ ఉత్పత్తుల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించనున్నట్టు అమన్ గుప్తా వెల్లడించారు. బోట్ కంపెనీ ఇప్పటికే రూ. 1,100 కోట్ల పబ్లిక్ ఇష్యూ కోసం సెబీ వద్ద దరఖాస్తు చేసింది. ఇందులో రూ. 900 కోట్లు తాజా ఇష్యూ కాగా, మిగిలిన మొత్తం ఆఫర్ ఫర్ సేల్ కింద ఉంచింది.

Next Story

Most Viewed