దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం

by Dishanational1 |
దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం దిగొచ్చింది. గతేడాది డిసెంబర్‌లో నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరిన సీపీఐ ద్రవ్యోల్బణం గత నెలలో శాంతించింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2023, డిసెంబర్‌లో 5.69 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణం ఆధారిత ధరల సూచీ (సీపీఐ) జనవరిలో 5.10 శాతానికి తగ్గింది. ప్రధాన ఆహార పదార్థాల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో ఆహార ద్రవ్యోల్బణం 9.53 శాతం నుంచి 8.30 శాతానికి తగ్గుముఖం పట్టింది. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచే బాధ్యతను ప్రభుత్వం ఆర్‌బీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక, భారతదేశపు పారిశ్రామిక ఉత్పత్తి 2023, నవంబర్‌లో 2.4 శాతం నుంచి 2023, డిసెంబర్‌లో 3.8 శాతానికి పెరిగింది. సోమవారం విడుదలైన కేంద్ర గణాంక కార్యాలయం డేటా ప్రకారం, సమీక్షించిన నెలలో విద్యుదుత్పత్తి 1.2 శాతం క్షీణించింది. మైనింగ్ ఉత్పత్తి 6.8 శాతం నుంచి 5.1 శాతానికి పడిపోయింది. తయారీ రంగ ఉత్పత్తి 3.9 శాతం పెరిగింది.


Next Story

Most Viewed