‘విదేశాల్లో పనిచేసేందుకు అంతగా ఆసక్తి చూపని భారతీయులు’

by Disha Web Desk 17 |
‘విదేశాల్లో పనిచేసేందుకు అంతగా ఆసక్తి చూపని భారతీయులు’
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయులు విదేశాల్లో పని చేయడానికి తక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఇటీవల జరిగిన ఒక సర్వేలో వెల్లడైంది. BCG, నెట్‌వర్క్, స్టెప్‌స్టోన్ గ్రూప్ 'ఇంటర్నేషనల్ మొబిలిటీ ట్రెండ్స్' నివేదిక ప్రకారం, 2018-2020 మధ్య దాదాపు 78 శాతం మంది భారతీయులు విదేశాల్లో పని చేయడానికి ఇష్టపడగా, అది 2023 నాటికి 54 శాతానికి తగ్గింది. ఒకప్పుడు గ్లోబల్ ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లే వారు క్రమంగా తమ ధోరణి మార్చుకుంటున్నారు. తమ దేశంతో ఉన్న బలమైన సంబంధం, బంధువులకు దూరంగా ఉండటం ఇష్టం లేక పని కోసం తమ నివాసాలను మార్చడానికి 59 శాతం మంది ఇష్టపడటం లేదు.

188 దేశాల్లో 1.5 లక్షల కంటే ఎక్కువ మంది శ్రామిక శక్తిని సర్వే చేయగా దాదాపు 63 శాతం మంది ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. అయితే వారిలో 23 శాతం మంది నిపుణులు మాత్రం ఇతర దేశాల్లో ఉద్యోగాలను వెతుక్కునే పనిలో చురుగ్గా ఉన్నారని నివేదిక పేర్కొంది. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులు తమ వృత్తిపరమైన పురోగతి కోసం విదేశాలకు తరలివెళ్తారని సర్వేలో తేలింది.

ఆర్థిక కారణాల పేరుతో 64 శాతం మంది, ఉద్యోగ అనుభవం కోసం 56 శాతం మంది ఇతర దేశాల్లో ఉపాధిని వెతుక్కుంటున్నారు. ఒక దేశాన్ని ఎంచుకునే ముందు అక్కడ ఉన్నటువంటి సానుకూల అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. వాటిలో, ఉద్యోగ అవకాశాల ప్రాతిపదికన 65 శాతం, జీవన నాణ్యత-వాతావరణం ఆధారంగా 54 శాతం, పౌరసత్వానికి అవకాశాలు 18 శాతం, ఆరోగ్య సంరక్షణకు 15 శాతం వంటి నిర్దిష్ట అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ముఖ్యంగా ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో యువత ఉద్యోగాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని నివేదిక తెలిపింది. జాబితాలో ఆస్ట్రేలియా, US, కెనడా, UK నాలుగు అత్యంత ముఖ్యమైన దేశాలు. అదే నగరాల వారీగా లండన్, న్యూయార్క్ అగ్రస్థానంలో ఉన్నాయి. దేశీయంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కెరీర్ అవకాశాలను కోరుకునే నిపుణులకు ఇటీవల కాలంలో భారత్ ఆశాజనకంగా కనిపిస్తుంది. పనిచేయడానికి ఇష్టపడే దేశాల జాబితాలో భారత్‌ ఆరో ర్యాంక్‌ను కలిగి ఉంది.



Next Story

Most Viewed