యూనివర్శల్ బ్యాంకుగా మారాలనే లక్ష్యంతో ఉన్నాం: IPPB సీఈఓ!

by Disha Web Desk 17 |
యూనివర్శల్ బ్యాంకుగా మారాలనే లక్ష్యంతో ఉన్నాం: IPPB సీఈఓ!
X

న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ)ని భవిష్యత్తులో యూనివర్శల్ బ్యాంకుగా మార్చాలనే లక్ష్యంతో ఉన్నట్టు సీఈఓ, ఎండీ జె వెంకట్రాము మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమకున్న విస్తారమైన బ్రాంచ్ నెట్‌వర్క్ ద్వారా ఆర్థిక మద్దతు లభిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని ఆయన అభిప్రాయపడ్డారు.

2018లో ఐపీపీబీ కార్యకలాపాలు ప్రారంభించిన సమయంలో 80 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరిగాయి. అయితే, ఆ తర్వాతి పరిణామాల్లో టెక్నాలజీ మద్దతుతో ప్రస్తుతం 20 శాతం లావాదేవీలను మాత్రమే నగదు రూపంలో, 80 శాతం డిజిటల్‌గా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.

పోస్టాఫీసుల నెట్‌వర్క్ ప్రతి మూలకు చేరుకోగల సామర్థ్యం ఉంది. పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ లైసెన్స్ పొందితే గనుక, ప్రత్యేకించి ఆర్థిక మద్దతు లభిస్తే పెద్ద లక్ష్యాలను సాధించడం సులభమవుతుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన కార్యక్రమంలో వివరించారు.

పోస్టాఫీసులకు ఉన్న నెట్‌వర్క్ ఆర్థిక, క్రెడిట్ విస్తరణకు వీలవుతుంది. ప్రస్తుతం ఆర్‌బీఐ కింద పేమెంట్ బ్యాంకుగా డిపాజిట్లు, చెల్లింపులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర సేవలను అందించగలమే కానీ రుణాలివ్వడం, క్రెడిట్ కార్డులను జారీ చేయలేమన్నారు.


Next Story

Most Viewed