ఈ ఏడాది జీతాలు 9.5 శాతం పెరగొచ్చు

by S Gopi |
ఈ ఏడాది జీతాలు 9.5 శాతం పెరగొచ్చు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది వివిధ రంగాల్లోని ఉద్యోగుల జీతాలు స‌గ‌టున 9.5 శాతం పెర‌గ‌వ‌చ్చ‌ని అయాన్ క‌న్స‌ల్టింగ్ సంస్థ స‌ర్వే వెల్లడించింది. అట్రిషన్ రేటు తగ్గుతుండటం, ప్రపంచ డిమాండ్-ఆధారిత టెక్ రంగాలు ప్రతికూలత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈసారి వేతనాల పెంపు స్వల్పంగా తగ్గుతుందని అయాన్ అభిప్రాయపడింది. 2023లో సగటున జీతాల పెరుగుదల 9.7 శాతంగా ఉంది. బుధవారం విడుదలైన అయాన్ నివేదిక ప్రకారం, గతేడాది కంటే తక్కువగా ఉన్నప్పటికీ భారత్‌లో జీతాల పెంపు ఇప్పటికీ ఆసియా పసిఫిక్ దేశాల సగటు కంటే ఎక్కువగానే ఉంది. అంతేకాకుండా ద్రవ్యోల్బణంతో పోలిస్తే జీతాల పెరుగుదల 5 శాతానికి చేరిందని డేటా తెలిపింది. ఈ గణాంకాలు 2018, 2019 కరోనా ముందునాటి పరిస్థితులకు తిరిగి చేరడం కనిపిస్తుందని నివేదిక పేర్కొంది. దాదాపు 45 పరిశ్రమలకు చెందిన 1,414 కంపెనీల డేటాను నివేదికలో పొందుపరిచినట్టు అయాన్ పేర్కొంది.

ఈ ఏడాదికి సంబంధించి కంపెనీ తమ ఉద్యోగులకు 9-12 శాతం మేర జీతాలను పెంచనున్నాయి. అందులో అధికంగా తయారీ రంగం 10.1 శాతమని భావిస్తుండగా, ఆర్థిక సంస్థలు(9.9 శాతం), లైఫ్ సైన్స్(9.9 శాతం) గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(9.8 శాతం), కెమికల్(9.7 శాతం), ప్రొఫెషనల్ సర్వీసెస్(9.7 శాతం) మెరుగైన పెంపును ఇవ్వనున్నాయి. ఇక, టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అండ్ ప్రోడక్ట్స్(9.5 శాతం), టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్(8.2 శతం) పెంచనున్నాయి. ఈ-కామర్స్‌లో(9.2 శాతం), రిటైల్ రంగంలో 8.4 శాతంతో తక్కువ పెరుగుదల ఉండనుంది. గతేడాదితో పోలిస్తే దేశీయ తయారీ పరిశ్రమల జీతాల పెరుగుదల స్థిరంగా ఉంది. ప్రపంచ మాంద్యం పరిస్థితుల మధ్య ఐటీ, ఆర్థిక సేవల సంస్థలపై ప్రభావం కనిపిస్తోందని నివేదిక వివరించింది.

ఇక, జూనియర్ స్థాయి ఉద్యోగుల వేతనాలు అత్యధికంగా 9.9 శాతం పెరగనుండగా, మిడిల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులు 9.4 శాతం, టాప్ అండ్ సీనియర్ మేనేజ్‌మెంట్ వర్గాల వారి జీతాలు 9.1 శాతం సగటుతో వేతన పెంపును చూడనున్నారు. సీనియర్ మేనేజ్‌మెంట్ వర్గంలోని ఉద్యోగులు నగదు, నగదు రహిత పరిహారాలను కూడా పొందుతారు. 'భారతీయ కంపెనీల్లో జీతాల పెరుగుదల అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలో మార్పులను సూచిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు ప్రభావం ఉన్నప్పటికీ మౌలిక, తయారీ రంగాల కంపెనీలు బలమైన వృద్ధిని కొనసాగిస్తూనే, పెట్టుబడులను సాధిస్తున్నాయని ' అయాన్ టాలెంట్ సొల్యూషన్స్ పార్ట్‌నర్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రూపాంక్ చౌదరీ పేర్కొన్నారు.Next Story

Most Viewed