Salary: ఈ ఏడాది 10 శాతం వరకు జీతాల పెంపు

by S Gopi |

ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ), ఈవీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్ వంటి వేగంగా ఎదుగుతున్న రంగాలు ఎక్కువ జీతం పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Salary: ఈ ఏడాది 10 శాతం వరకు జీతాల పెంపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత కార్పొరేట్ రంగంలోని ఉద్యోగులు ఈ ఏడాది మెరుగైన వేతన పెంపును చూడనున్నారు. ప్రముఖ టీమ్‌లీజ్ సర్వీసెస్ తాజా నివేదిక ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరంలో వివిధ పరిశ్రమల్లో సగటున 8.6 శాతం నుంచి 10.2 శాతం వరకు జీతాల పెంపులు ఉండొచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ), ఈవీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్ వంటి వేగంగా ఎదుగుతున్న రంగాలు ఎక్కువ జీతం పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో కేవలం అనుభవం కాకుండా, ప్రత్యేక నైపుణ్యాలు, పనితీరు కీలకంగా మారాయి. అందుకే ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ నిపుణులు, ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు వంటి ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతూ, వీరికి రెండంకెల స్థాయికి చేరువలో జీతాల పెంపులు లభించే అవకాశం కనిపిస్తోంది.

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, జీతాల వృద్ధి కొన్ని నగరాలకే పరిమితం కావడం లేదు. చెన్నై (9.7 శాతం), హైదరాబాద్, పుణె (9.6 శాతం), అహ్మదాబాద్, విశాఖపట్నం (9.5 శాతం) వంటి నగరాలు జీతాల పెంపుల్లో ముందంజలో ఉండనున్నాయని నివేదిక చెబుతోంది. తయారీ రంగ విస్తరణ, కొత్త పెట్టుబడులు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి కారణంగా విశాఖపట్నం, నాగ్‌పూర్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలు కూడా ఉద్యోగ అవకాశాల కేంద్రాలుగా మారుతున్నాయి. మరోవైపు బ్యాంకింగ్, టెలికాం, నిర్మాణం, రియల్ ఎస్టేట్ వంటి సాంప్రదాయ రంగాల్లో జీతాల పెంపులు కొంత మితంగా ఉన్నప్పటికీ, మొత్తం ఉద్యోగ మార్కెట్‌లో నైపుణ్యం కలిగిన సిబ్బందికి డిమాండ్ బలంగానే కొనసాగుతోందని నివేదిక పేర్కొంది.

Next Story