నిషేధం ఎత్తివేత తర్వాత 45,000 టన్నుల ఉల్లిని ఎగుమతి చేసిన భారత్

by Harish |
నిషేధం ఎత్తివేత తర్వాత 45,000 టన్నుల ఉల్లిని ఎగుమతి చేసిన భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ నెల ప్రారంభంలో ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన తరువాత భారత్ 45,000 టన్నులకు పైగా ఉల్లిని ఇతర దేశాలకు ఎగుమతి చేసిందని ప్రభుత్వ ఉన్నతాధికారి బుధవారం తెలిపారు. ఇంతకుముందు దేశీయంగా ఉల్లి ధరలను స్థిరంగా ఉంచడానికి, వాటి సరఫరాను సులభం చేయడానికి ఎగుమతులపై కేంద్రం డిసెంబర్‌లో ఆంక్షలు విధించింది. ఉత్పత్తి తక్కువగా ఉండటం వలన ఆ నిషేధాన్ని మార్చిలో పొడిగించారు. అయితే ఆంక్షల కారణంగా ఉల్లిని ఎగుమతి చేయడం కుదరడం లేదని పెట్టుబడి మేరకు లాభాలు రావడం లేదని రైతులు నిరసన వ్యక్తం చేయగా సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వం మే 4న నిషేధాన్ని ఎత్తివేసింది.

ప్రస్తుత సంవత్సరానికి లక్ష్యంగా 5,00,000-టన్నుల బఫర్ స్టాక్‌ను తమ వద్ద ఉంచుకోడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఏజెన్సీలు ఇటీవలి రబీ పంట నుండి ఉల్లిపాయలను సేకరించడం ప్రారంభించాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ మొదటి అంచనాల ప్రకారం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి కీలకమైన ప్రాంతాలలో ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల 2023-24 పంట సంవత్సరంలో దేశం ఉల్లి ఉత్పత్తి అంతకు ముందు సంవత్సరం నుండి 16 శాతం పడిపోయింది. ఈ ఏడాది రుతుపవనాల ద్వారా వర్షాలు బాగా కురుస్తాయని అంచనా వేయడంతో జూన్‌ నుంచి ఉల్లితో సహా ఖరీఫ్‌ (వేసవి) పంటలు బాగా పండుతాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి ఖరే చెప్పారు.

Next Story

Most Viewed