ఉల్లి ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం

by Disha Web Desk 6 |
ఉల్లి ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లి ధరలను అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉల్లి కిలో రూ. 60 కంటే ఎక్కువగా ఉంది. ఇది గతేడాది కంటే 98 శాతం అధికం. ఈ క్రమంలోనే వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి 2024, మార్చి వరకు ఉల్లిపాయల ఎగుమతిని నిషేధిస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. దేశీయంగా ఉల్లి ధరల నియంత్రణతో పాటు సరఫరా ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈ నిషేధం శుక్రవారం(డిసెంబర్ 8) నుంచే అమలవుతుందని పేర్కొంది. అయితే, ఇప్పటికే ఓడల్లో లోడింగ్ అయిన, కస్టమ్స్ పరిధిలో ఉన్న ఉల్లిని ఎగుమతి చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో తెలిపింది. ఇతర దేశాల అభ్యర్థనల ఆధారంగా భారత ప్రభుత్వ అనుమతితో సదరు దేశాలకు ఎగుమతులు చేసుకోవచ్చు. ఉల్లి ధరలకు సంబంధించి కేంద్రం పలుమార్లు ఎగుమతుల పాలసీలను సవరించింది. ఆగష్టులో ఉల్లి ఎగుమతులపై 40 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించింది.Next Story